Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

2 కొరింథీయులకు 1వ అధ్యాయము

1  దేవుని చిత్తమువలన క్రీస్తు1 యేసుయొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమొథెయును, కొరింథులోనున్న దేవుని సంఘమునకును, అకైయయందంతటనున్న పరిశుద్ధులకందరికిని (శుభమని చెప్పి ) వ్రాయునది. 
2  మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగుగాక. 
3  కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు, స్తుతింపబడుగాక. 
4  దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైన ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. 
5  క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. 
6  మేము శ్రమపొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేముకూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై యున్నది. 
7  మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో ఆలాగే ఆదరణలోను పాలివారై యున్నారని యెరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది. 
8  సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతిమి. 
9  మరియు మృతులను లేపు దేవునియందే గాని మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను. 
10  ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణగలవారమై యున్నాము. 
11  అందువలన అనేకుల ప్రార్థనద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. 
12  మా అతిశయమేదనగా లౌకికజ్ఞనము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు, మిశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుచున్నది. 
13  మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియు మీకు వ్రాయుట లేదు; కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము. 
14  మరియు మన ప్రభువైన యేసుయొక్క దినమందు మీరు మాకేలాగో, ఆలాగే మేము మీకును అతిశయాస్పదమై యుందుమని, మీలో కొందరు మమ్మును ఒప్పుకొనియున్నారు. 
15-16. మరియు ఈ నమ్మికగలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీయొద్దకు వచ్చి, మీ యొద్దనుండి మకెదొనియకు వెళ్లి మకెదొనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యుదైయకు సాగనంపబడవలెనని ఉద్దేశించితిని. 
17  కావున నేనీలాగు ఉద్దేశి 0చి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా? 
18  దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు. 
19  మాచేత, అనగా నా చేతను సిల్వానుచేతను తిమొథెయుచేతను, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవుననువాడై యున్నాడు. 
20  దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి. 2
21  మీతోకూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. 
22  ఆయన మనకు ముద్రవేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు. 
23  మీయందు కనికరము కలిగి నేను మరల కొరింథుకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవుని సాక్షిగా పెట్టుచున్నాను. 
24  మీ విశ్వాసముమీద మేము ప్రభువులమని (యీలాగు చెప్పుటలేదు ) గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలకడగా ఉన్నారు. 
Download Audio File

2 కొరింథీయులకు 2వ అధ్యాయము

1  మరియు నేను దుఃఖముతో మీయొద్దకు తిరిగి రానని నామట్టుకు నేను నిశ్చయించుకొంటిని. 
2  నేను మిమ్మును దుఃఖపరచునెడల నాచేత దుఃపరచబడినవాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? 
3  నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో, వారివలన నాకు దుఃఖము కలుగకుండవలెనని యీ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషముగా (మీరు భావించుచున్నారని ) మీ అందరియందు నమ్మకము కలిగి యీలాగు వ్రాసితిని. 
4  మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని మీయెడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని. 
5  ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల, నాకు (మాత్రము ) కాదు కొంతమట్టుకు మీకందరికిని దుఃఖము కలుగజేసియున్నాడు. నేను విశేష భారము వానిమీద మోపకోరక (యీ మాట చెప్పుచున్నాను ) 
6  అట్టివానికి మీలో ఎక్కువమందివలన కలిగిన యీ శిక్షయే చాలును. 
7  గనుక మీరిక వాని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. 
8  కావున వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 
9  మీరన్ని విషయములయందు విధేయులై యున్నారేమో అని మీ యోగ్యత తెలిసికొనుటకే గదా (పూర్వము ) వ్రాసితిని. 
10-11. మీరు దేనిగూర్చియైనను ఎవని క్షమించుచున్నారో నేనును వాని క్షమించుచున్నాను; నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; వాని తంత్రములను మనము ఎరుగనివారము కాము. 
12  క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించియుండగా, 1సహోదరుడైన తీతు నాకు కనబడనందున 
13  నా మనస్సులో నెమ్మది లేక వారియొద్ద సెలవు తీసికొని అక్కడనుండి మకెదొనియకు బయలుదేరితిని. 
14  క్రీస్తునందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచు, మా ద్వారా ప్రతి స్థలమందు ఆయననుగూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచున్న దేవునికి స్తోత్రము. 
15  రక్షింపబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము. 
16  నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. 
17  కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన (నియమింపబడిన ) వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించుచున్నాము. 
Download Audio File

2 కొరింథీయులకు 3వ అధ్యాయము

1  మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీయొద్దకైనను మీయొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? 
2  మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచు ఉన్న మా పత్రిక మీరే కారా? 
3  రాతి పలకలమీద సిరాతో వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు. 
4  క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు 
5  మావలన ఏదైన అయినట్టుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవునివలననే కలిగియున్నది. 
6  ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. 
 7-8. మరణకారమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములతో సంబంధించినదైనను, మహిమతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను, ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మసంబంధమైన పరిచర్య యెంత మహిమగలదై యుండును? 
9  శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమకలదగును. 
10  అత్యధికమైన మహిమ కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను. 
11  తగ్గిపోవునదే2మహిమగలదై యుండినయెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా? 
12-13. తగ్గిపోవుచున్న2(మహిమ ) అంతమును ఇశ్రాయేలీయులు తేరిచూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసికొనెను. మేమట్లు చేయక, యిట్టి నిరీక్షణగలవారమై బహు ధైర్యముగా మాటలాడుచున్నాము. 
14  మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది. 
15  నేటివరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని 
16  వారి హృదయము ప్రభువు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. 
17  ప్రభువే ఆత్మ. ప్రభువుయొక్క ఆత్మ యెక్కడనుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. 
18  మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమ పొందుచు, ప్రభువగు ఆత్మచేత1ఆ పోలికగానే మార్చబడుచున్నాము. 
Download Audio File

2 కొరింథీయులకు 4వ అధ్యాయము

1  ఈ పరిచర్య పొందినవారమై కరుణింపబడినందున అధైర్యపడము. 
2  అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షియెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము. 
3  మా సువార్త మరుగుచేయబడినయెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయబడియున్నది. 
4  దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశమువారికి ప్రకాశింపకుండునిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసి యున్నాడు. 
5-6. - అంధకారములోనుండి వెలుగు ప్రకాశించు గాక2అని పలికిన దేవుడే తన మహిమనుగూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మేము మమ్మునుగూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. 
7  అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండనట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలిగియున్నది. 
8  ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; 
9  తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము. 
10  యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము. 
11  ఏలయనగా యేసుయొక్క జీవముకూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడునట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. 
12  కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. 
13  కృప యెక్కువమంది ద్వారా ప్రబలించి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి. కాగా 
 14-15. - విశ్వసించితిని గనుక మాటలాడితిని3అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ కలవారమై, ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మునుకూడ లేపి మీతోకూడ తనయెదుట నిలువబెట్టునని యెరిగి, మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. 
16  కావున మేము అధైర్యపడము; మా బాహ్యపురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. 
17  మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక 
18  క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. 
Download Audio File

2 కొరింథీయులకు 5వ అధ్యాయము

1  భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదము. 
2  మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండివచ్చు మన నివాసము దీనిపై ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. 
3-4. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మ్రింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము. 
5  దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు. 
6  వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము. 
7  గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని యెరిగియుండియు, ఎల్లప్పుడును ధైర్యముకలవారమై యున్నాము. 
8  ఇట్లు ధైర్యము కలిగి యీ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. 
9  కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. 
10  ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించినవాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. 
11  కావున మేము ప్రభువు విషయమైన భయమునెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను. 
12  మమ్మును మేమే మీ యెదుట తిరిగి మెప్పించుకొనుటలేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయాస్పదము కలిగించుచున్నాము. 
13  ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. 
14  క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు, 
15  జీవించువారికమీదట తమకొరకు కాక తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. 
16  కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైన ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము. 
17  కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను; 
18  సమస్తమును దేవునివలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధాన విషయమైన పరిచర్యను మాకు అనుగ్రహించెను. 
19  అదేమనగా దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక; క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును (ప్రచురించుట ) మాకు అప్పగించెను. 
20  కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయభారులమై - దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. 
21  ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసరము పాపముగా చేసెను. 
Download Audio File

2 కొరింథీయులకు 6వ అధ్యాయము

1  కాగా మేమాయనతోటిపనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. 
2  -అనుకూల సమయమందు నీ మనవి ఆలకించితిని;రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినిఅని ఆయన చెప్పుచున్నాడు గదా?1ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణదినము. 
3  మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక 
4  శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును 
5  దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై, 
6  పవిత్రతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన, ప్రేమతోను 
7  సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడి యెడమల నీతి ఆయుధములు కలిగి, 
 8-10. ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యున్నామని అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్లమైనట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్నవారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింపబడినవారమైనట్లుండియు చంపబడనివారము; దుఃఖపడినవారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము. 
11  ఓ కొరింథీయులారా అరమర లేకుండ మీతో మాటలాడుచున్నాను;2మా హృదయము విశాలపరచబడియున్నది. 
12  మీయెడల మా అంతఃకరణమే సంకుచితమై యున్నది. 
13  మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను. 
14  మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? 
15  క్రీస్తుకు బెలియాలుతో ఏమి సందర్భము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? 
 16-18. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము;అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు3నేను వారిలో నివసించి సంచరింతును, నేనువారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. - కావున మీరు వారి మధ్యనుండిబయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి;అపవిత్రమైనదాని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు- మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. 
Download Audio File

2 కొరింథీయులకు 7వ అధ్యాయము

1  ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు కలిగియున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి మనలను పవిత్రులనుగా చేసికొందము. 
2  మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి; మేమెవనికిని అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసముచేయలేదు. 
3  మీకు శిక్షావిధికలుగవలెనని నేనీలాగు చెప్పలేదు. చనిపోయిన గాని జీవించినగాని మీరును మేమును కూడ ఉండవలెనని మీరు మా హృదయములలో ఉన్నారని నేను లోగడ చెప్పితిని గదా? 
4  మీయెడల నేను బహుధైర్యముగా మాటలాడుచున్నాను, మిమ్మునుగూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమ యంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. 
5  మేము మకెదొనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. 
6  అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను. 
7  తీతు రాకవలన మాత్రమే కాకుండ, అతడు మా అత్యభిలాషను మీ అంగలార్పును మా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణవలన కూడ మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. 
8  నేను వ్రాసిన పత్రికవలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను; నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టితినని తెలిసికొనియున్నాను. 
9  మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు; మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మావలన మీరు నష్టము పొందకుండుటకై, దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. 
10  దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సు కలుగజేయును; (ఈ మారుమనస్సు ) పశ్చాత్తాపము పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. 
11  మీరు దేవుని చిత్తప్రకారము పొందిన యీ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి (దోష నివారణకైన ) ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమునుగూర్చి సమస్త విషయములలోను మీరు నిర్దోషులై యున్నారని రుజువుపరచుకొంటిరి. 
12  నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు; వానివలన అన్యాయము పొందినవాని నిమిత్తమైనను వ్రాయలేదు; మాయెడల మీకున్న ఆసక్తి దేవునియెదుట మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని. 
13  ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతుయొక్క ఆత్మ మీ అందరివలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి యెక్కువగా మేము సంతోషించితిమి. 
14  ఏలయనగా నేనతని యెదుట మీ విషయమై అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేమేలాగు అన్నిటిని మీతో నిజముగా చెప్పితిమో ఆలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. 
15  మరియు మీరు భయముతోను వణకుతోను తన్ను చేర్చుకొంటిరని అతడు మీయందరి విధేయతను జ్ఞాపకముచేసికొనుచుండగా, అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీయెడల ఉన్నది. 
16  ప్రతి విషయములోను మీవలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను. 
Download Audio File

2 కొరింథీయులకు 8వ అధ్యాయము

1  సహోదరులారా, మకెదొనియ సంఘములకు అనుగ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియజేయుచున్నాము. 
2  ఏలాగనగా వారు బహు శ్రమలవలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహూగా విస్తరించెను. 
  3-4. ఈ కృప విషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. 
5  ఇదియు గాక మొదట ప్రభువుకును, దేవుని చిత్తమువలన మాకును తమ్ము తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు. 
6  కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో ఆలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడుకొంటిమి. 
7  మీరు ప్రతివిషయములో, అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రతయందును మీకు మాయెడలనున్న ప్రేమయందును ఏలాగు అభివృద్ధిపొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందుకూడ అభివృద్ధిపొందునట్లు చూచుకొనుడి. 
8  ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు; ఇతరుల జాగ్రతను మీకు చూపుటచేత మీ ప్రేమ యెంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను. 
9  మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా? ఆయన ధనవంతుడై యుండినను, మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను. 
10  ఇందునుగూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను; సంవత్సరము క్రిందటనే యీ కార్యము చేయుటయందే గాక చేయ తలపెట్టుటయందు కూడ మొదటివారై యుండిన మీకు అది చాలును. 
11  కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో, ఆలాగే మీ కలిమికొలది సంపూర్తియగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. 
12  మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమికొలదియే యిచ్చినది ప్రీతికరమవును. 
13  ఇతరులకు సుఖమును మీకు కష్టమును కలుగవలెనని యిది చెప్పుటలేదు గాని 
  14-15. -నిండుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగుల లేదనియు కొంచెముగా కూర్చుకొనినవానికి తక్కువ కాలేదనియు1వ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండు నిమిత్తము, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును (మరియొకప్పుడు ) వారి సమృద్ధి మీయక్కరకును సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను. 
16  మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. 
17  అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన యిష్టముచొప్పుననే మీయొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. 
18  మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధిచెందిన సహోదరుని అతనితోకూడ పంపుచున్నాము. 
19  అంతేకాక మన ప్రభువుకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతోకూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారతని ఏర్పరచుకొనిరి. 
20  మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై యున్నాము గనుక దానిగూర్చి మామీద ఎవడును తప్పు మోపకుండ మేము జాగ్రత్తగా చూచుకొనుచు (అతని పంపుచున్నాము. ) 
21  ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైనవాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. 
22  మరియు వారితోకూడ మేము మా సహోదరుని పంపుచున్నాము. అనేక సంగతులలో అనేక పర్యాయములు అతని పరీక్షించి అతడు ఆసక్తిగలవాడనియు, ఇప్పుడును మీయెడల అతనికి కలిగిన విశేషమైన నమ్మికవలన మరి యెక్కువైన ఆసక్తిగలవాడనియు తెలిసికొనియున్నాము. 
23  - తీతు ఎవడని (యెవరైన అడిగినయెడల ) - అతడు నా పాలివాడును మీ విషయములో నా జత పనివాడునైయున్నాడనియు; - మన సహోదరులెవరని (అడిగినయెడల ) - వారు సంఘముల దూతలును2క్రీస్తు మహిమయునై యున్నారనియు నేను చెప్పుచున్నాను. 
24  కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థముకాదనియు వారికి3సంఘములయెదుట కనుపరచుడి. 
Download Audio File

2 కొరింథీయులకు 9వ అధ్యాయము

1  పరిశుద్ధులకొరకైన యీ పరిచర్యనుగూర్చి మీ పేర వ్రాయుటకు నా కగత్యములేదు. 
2  మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలన - సంవత్సరమునుండి అకైయ సిద్ధపడియున్నదని చెప్పి నేను మిమ్మునుగూర్చి మకెదొనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. 
3  అయితే మిమ్మునుగూర్చిన మా అతిశయము చెప్పినప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై యీ సహోదరులను పంపితిని. 
4  మీరు సిద్ధపడనిపక్షమున ఒకవేళ మకెదొనియవారెవరైనను నాతోకూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గుపరచబడుదుము; మీరు సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల? 
5  కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. 
6  కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకొయును, సమృద్ధిగా4విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును. 
7  సణుగుకొనకను బలవంతముగా కాకను ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 
8  మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్తవిధములైన కృపను విస్తరింపచేయగలడు. 
9  ఇందు విషయమైఅతడు వెదజల్లి దరిద్రులకిచ్చెనుఅతని నీతి నిరంతరము నిలుచునుఅని వ్రాయబడియున్నది. 2
10  విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు (దేవుడు ) మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొందించును. 
11  ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. 
12  ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య పరిశుద్ధల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. 
13  ఏలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. 
14  మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థనచేయుచు, మిమ్మును చూడవలెనని విశేషాపేక్షగలవారై యున్నారు. 
15  చెప్ప శక్యము కాని ఆయన వరమునుగూర్చి దేవునికి స్తోత్రము.
Download Audio File

2 కొరింథీయులకు 10వ అధ్యాయము

1  యేసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి పౌలను నేను మిమ్మును వేడుకొనుచున్నాను. నేను మీ యెదుట నున్నప్పుడు మీలో అణుకువగలవాడను, ఎదుటలేనప్పుడు మీయెడల ధైర్యముగలవాడను. 
2  శరీరప్రకారము నడుచుకొనువారమని మమ్మునుగూర్చి కొందరనుకొనుచున్నారు కారా? అట్టి వారియెడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 
3  మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీరప్రకారము యుద్ధము చేయుము. 
4  మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని దేవునియెదుట దుర్గములను పడద్రోయజాలిన బలముకలవై యున్నవి. 
5  మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి 
6  మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి యున్నాము. 
7  సంగతులను పైపైన నే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడని నమ్ముకొనిన పక్షమున అతడేలాగు క్రీస్తువాడో ఆలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. 
8  పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమునుగూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. 
9  నేను వ్రాయు పత్రికలవలన మిమ్మును భయపెట్టవలెనని యున్నట్టు కనబడకుండ ఈ మాట చెప్పుచున్నాను. 
10  - అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై యున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును. 
11  మేమెదుటలేనప్పుడు పత్రికలద్వారా మాటలయందెట్టివారమై యున్నామో, యెదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై యుందుమని అట్లనువాడు తలంచుకొనవలెను. 
12  తమ్మునుతామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని, వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నికచేసికొని యొకరితో నొకరు సరిచూచుకొనుచున్నందున, గ్రహింపులేక యున్నారు. 
13  మేమైతే మేరకు మించి అతిశయపడముగాని మీరున్న స్థలమువరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము. 
14  మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు, మీవరకును వచ్చియుంటిమి గనుక మీయొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్లుచున్నవారము కాము. 
15  మేము మేరకు మించి యితరుల ప్రయాసఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధియైనకొలది మాకనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు, 
16  మీ ఆవలి ప్రదేశములలో కూడ సువార్త ప్రకటించునట్లుగా, మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని మరియొకని మేరలో చేరి సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపగోరము. 
17  అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. 
18  ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్నుతానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు. 
Download Audio File

2 కొరింథీయులకు 11వ అధ్యాయము

1  కొంచెమవివేకముగా నేను మాటలాడినను సహింపవలెనని కోరుచున్నాను, నన్నుగూర్చి మీరేలాగైనను సహించుడి. 
2  దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని గాని, 
3  సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తుయెడలనున్న సరళతనుండియు పవిత్రతనుండియు ఎట్లయిన తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. 
4  ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిగూర్చి సహించుట యుక్తమే. 
5  నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను. 
6  మాటలయందు నేను నేర్పులేనివాడనైనను జ్ఞానమందు నేర్పులేనివాడను కాను. ప్రతి సంగతిలోను అందరి మథ్యను మీ నిమిత్తము మేము (ఆ జ్ఞానమును ) కనుపరచియున్నాము. 
7  మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా? 
8  మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలినవాడనైతిని. 
9  మరియు నేను మీయొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా నేనెవనిమీదను భారము మోపలేదు; మకెదొనియనుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్తపడితిని, ఇక ముందుకును జాగ్రత్తపడుదును. 
10  క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకైయ ప్రాంతములయందు నేనీలాగు అతిశయపడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు. 
11  ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే తెలియును. 
12  అతిశయకారణము వెదకువారు ఏ విషయములో అతిశయించుచున్నారో ఆ విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరుకకుండ కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును. 
13  ఏలయనగా అట్టివారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్లగు పనివారునై యున్నారు. 
14  ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. 
15  గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియలచొప్పున వారి కంతము కలుగును. 
16  నేను మరల చెప్పుచున్నాను. నేను అవివేకినని యెవడును తలంచవద్దు. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టు గానే చేర్చుకొనుడి. 
17  నేను చెప్పుచున్నది ప్రభువు చిత్తప్రకారము చెప్పుటలేదు; అవివేకివలె చెప్పుచున్నాను. ఇట్లు అతిశయపడుటకు ఆధారముకలిగి చెప్పుచున్నాను. 
18  అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును. 
19  మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. 
20  ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్ము మ్రింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్పచేసికొనినను, ఒకడు ముఖము మీద మిమ్ము కొట్టినను మీరు సహించుచున్నారు. 
21  మేము బలహీనులమై యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగియున్నాడో ఆ విషయమందు నేను కూడ ధైర్యము కలిగినవాడును; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా. 
22  వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే 
23  వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని. 
24  యూదులచేత అయిదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు1తింటిని; 
25  ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక దివారాత్రము సముద్రములో గడిపితిని. 
26  అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని. 
27  ప్రయాసతోను, కష్టములతోను, తరుచుగా జాగరణములతోను, ఆకలిదప్పులతోను, తరుచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. 
28  ఇవియుగాక సంఘములన్నిటినిగూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. 
29  ఎవడైన బలహీనుడాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైన తొట్రుపడెనా? నాకును మంట కలుగదా? 
30  అతిశయపడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును. 
31  నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును. 
32  దమస్కులో అరెత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రముచేసెను. 
33  అప్పుడు నేను కిటికీగుండ గోడమీదనుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొనిపోతిని. 
Download Audio File

2 కొరింథీయులకు 12వ అధ్యాయము

1  అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసివచ్చినది. ప్రభువు (దయచేసిన ) దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. 
2  క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. 
 3-4. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోకి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును. 
5  అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను. 
6  అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచినదానికన్నను నావలన వినినదానికన్నను నన్ను ఎక్కవ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. 
7  నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా, ఉంచబడెను. 
8  అది నా యొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. 
9  అందుకు - నా కృప నీకు చాలును. బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తమే, 1విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. 
10  నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము (నాకు కలిగిన ) బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. 
11  నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి 
12  సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలునియొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచితిని. 
13  నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప మరి ఏ విషయములో మీరితర సంఘములకంటె తక్కువ వారైతిరి? నేను చేసిన యీ అన్యాయమును క్షమించుడి. 
14  ఇదిగో యీ మూడవ సారి మీయొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగానుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. 2పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలిదండ్రులే పిల్లలకొరకు ఆస్తి కూర్చతగినది గదా? 
15  కాబట్టి (నాకు కలిగినది యావత్తు ) మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్ను నేనును వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? 
16  అది అలాగుండనియ్యుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును తంత్రముచేత పట్టుకొంటిని (అని చెప్పుదురేమో ) 
17  నేను మీయొద్దకు పంపినవారిలో ఎవనివలనైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా? 
18  (మీయొద్దకు వెళ్లుటకు ) తీతును హెచ్చరించి అతనితోకూడ ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేమొక్క ఆత్మవలననే యొక్క అడుగు జాడలయందు నడుచుకొనలేదా? 
19  మేమింతవరకు (మా విషయమై ) మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవునియెదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాము; ప్రియులారా, మీ క్షేమాభివృద్ధికొరకు ఇవన్నియు చెప్పుచున్నాము. 
20-21. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులును ఉండునేమో అనియు, నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపముచేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరిచేష్టలకొరకు మారుమనస్సు పొందని అనేకులనుగూర్చి దుఃఖపడవలసివచ్చునేమో అనియు భయపడుచున్నాను.

2 కొరింథీయులకు 13వ అధ్యాయము

1  ఈ మూడవ సారి నేను మీయొద్దకు వచ్చుచున్నాను. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. 3
2  నేను మునుపు చెప్పితిని; నేనిప్పుడు మీయొద్ద లేకున్నను రెండవసారి మీయొద్దనున్నట్టుగానే, మునుపటినుండి పాపము చేయుచుండినవారికిని మిగిలినవారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చినయెడల శిక్షింపక విడువను. 
3  క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీయెడల బలహీనుడు కాడు గాని మీయందు శక్తిమంతుడైయున్నాడు. 
4  బలహీనతనుబట్టి ఆయన సిలువవేయబడెను గాని దేవుని శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి4బలహీనులమై యున్నాము గాని మీయెడల, దేవుని శక్తినిబట్టి, ఆయనతోకూడ జీవముగలవారము. 
5  మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మునుగూర్చి మీరే యెరుగరా? 
6  మేము భ్రష్టులము కామని మీరు తెలిసికొందురని నిరీక్షించుచున్నాను. 
7  మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము; మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము. 
8  మేము సత్యమునకు వ్యతిరేకముగా ఏమియు చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. 
9  మేము బలహీనులమై యున్నను మీరు బలవంతులై యుండినయెడల సంతోషించెదము. దీని నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావలెననియే, ప్రార్థించుచున్నాము. 
10  కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారముచొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూరముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను. 
11  తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సుగలవారై యుండుడి, సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును. 
12  పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకరికి ఒకరు వందనములు చేసికొనుడి. 
13  పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. 
14  ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.

   Download Audio File