Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

2 కొరింథీయులకు 1వ అధ్యాయము

1  దేవుని చిత్తమువలన క్రీస్తు1 యేసుయొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమొథెయును, కొరింథులోనున్న దేవుని సంఘమునకును, అకైయయందంతటనున్న పరిశుద్ధులకందరికిని (శుభమని చెప్పి ) వ్రాయునది. 
2  మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగుగాక. 
3  కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు, స్తుతింపబడుగాక. 
4  దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైన ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. 
5  క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. 
6  మేము శ్రమపొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేముకూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై యున్నది. 
7  మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో ఆలాగే ఆదరణలోను పాలివారై యున్నారని యెరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది. 
8  సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతిమి. 
9  మరియు మృతులను లేపు దేవునియందే గాని మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను. 
10  ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణగలవారమై యున్నాము. 
11  అందువలన అనేకుల ప్రార్థనద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. 
12  మా అతిశయమేదనగా లౌకికజ్ఞనము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు, మిశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుచున్నది. 
13  మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియు మీకు వ్రాయుట లేదు; కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము. 
14  మరియు మన ప్రభువైన యేసుయొక్క దినమందు మీరు మాకేలాగో, ఆలాగే మేము మీకును అతిశయాస్పదమై యుందుమని, మీలో కొందరు మమ్మును ఒప్పుకొనియున్నారు. 
15-16. మరియు ఈ నమ్మికగలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీయొద్దకు వచ్చి, మీ యొద్దనుండి మకెదొనియకు వెళ్లి మకెదొనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యుదైయకు సాగనంపబడవలెనని ఉద్దేశించితిని. 
17  కావున నేనీలాగు ఉద్దేశి 0చి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా? 
18  దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు. 
19  మాచేత, అనగా నా చేతను సిల్వానుచేతను తిమొథెయుచేతను, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవుననువాడై యున్నాడు. 
20  దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి. 2
21  మీతోకూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. 
22  ఆయన మనకు ముద్రవేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు. 
23  మీయందు కనికరము కలిగి నేను మరల కొరింథుకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవుని సాక్షిగా పెట్టుచున్నాను. 
24  మీ విశ్వాసముమీద మేము ప్రభువులమని (యీలాగు చెప్పుటలేదు ) గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలకడగా ఉన్నారు. 
Download Audio File

2 కొరింథీయులకు 2వ అధ్యాయము

1  మరియు నేను దుఃఖముతో మీయొద్దకు తిరిగి రానని నామట్టుకు నేను నిశ్చయించుకొంటిని. 
2  నేను మిమ్మును దుఃఖపరచునెడల నాచేత దుఃపరచబడినవాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? 
3  నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో, వారివలన నాకు దుఃఖము కలుగకుండవలెనని యీ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషముగా (మీరు భావించుచున్నారని ) మీ అందరియందు నమ్మకము కలిగి యీలాగు వ్రాసితిని. 
4  మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని మీయెడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని. 
5  ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల, నాకు (మాత్రము ) కాదు కొంతమట్టుకు మీకందరికిని దుఃఖము కలుగజేసియున్నాడు. నేను విశేష భారము వానిమీద మోపకోరక (యీ మాట చెప్పుచున్నాను ) 
6  అట్టివానికి మీలో ఎక్కువమందివలన కలిగిన యీ శిక్షయే చాలును. 
7  గనుక మీరిక వాని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. 
8  కావున వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 
9  మీరన్ని విషయములయందు విధేయులై యున్నారేమో అని మీ యోగ్యత తెలిసికొనుటకే గదా (పూర్వము ) వ్రాసితిని. 
10-11. మీరు దేనిగూర్చియైనను ఎవని క్షమించుచున్నారో నేనును వాని క్షమించుచున్నాను; నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; వాని తంత్రములను మనము ఎరుగనివారము కాము. 
12  క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించియుండగా, 1సహోదరుడైన తీతు నాకు కనబడనందున 
13  నా మనస్సులో నెమ్మది లేక వారియొద్ద సెలవు తీసికొని అక్కడనుండి మకెదొనియకు బయలుదేరితిని. 
14  క్రీస్తునందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచు, మా ద్వారా ప్రతి స్థలమందు ఆయననుగూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచున్న దేవునికి స్తోత్రము. 
15  రక్షింపబడు వారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము. 
16  నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. 
17  కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన (నియమింపబడిన ) వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించుచున్నాము. 
Download Audio File

2 కొరింథీయులకు 3వ అధ్యాయము

1  మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీయొద్దకైనను మీయొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? 
2  మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచు ఉన్న మా పత్రిక మీరే కారా? 
3  రాతి పలకలమీద సిరాతో వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు. 
4  క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు 
5  మావలన ఏదైన అయినట్టుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవునివలననే కలిగియున్నది. 
6  ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. 
 7-8. మరణకారమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములతో సంబంధించినదైనను, మహిమతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను, ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మసంబంధమైన పరిచర్య యెంత మహిమగలదై యుండును? 
9  శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమకలదగును. 
10  అత్యధికమైన మహిమ కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను. 
11  తగ్గిపోవునదే2మహిమగలదై యుండినయెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా? 
12-13. తగ్గిపోవుచున్న2(మహిమ ) అంతమును ఇశ్రాయేలీయులు తేరిచూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసికొనెను. మేమట్లు చేయక, యిట్టి నిరీక్షణగలవారమై బహు ధైర్యముగా మాటలాడుచున్నాము. 
14  మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది. 
15  నేటివరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని 
16  వారి హృదయము ప్రభువు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. 
17  ప్రభువే ఆత్మ. ప్రభువుయొక్క ఆత్మ యెక్కడనుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. 
18  మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమ పొందుచు, ప్రభువగు ఆత్మచేత1ఆ పోలికగానే మార్చబడుచున్నాము. 
Download Audio File

2 కొరింథీయులకు 4వ అధ్యాయము

1  ఈ పరిచర్య పొందినవారమై కరుణింపబడినందున అధైర్యపడము. 
2  అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షియెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము. 
3  మా సువార్త మరుగుచేయబడినయెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయబడియున్నది. 
4  దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశమువారికి ప్రకాశింపకుండునిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసి యున్నాడు. 
5-6. - అంధకారములోనుండి వెలుగు ప్రకాశించు గాక2అని పలికిన దేవుడే తన మహిమనుగూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మేము మమ్మునుగూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. 
7  అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై యుండనట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలిగియున్నది. 
8  ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; 
9  తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము. 
10  యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము. 
11  ఏలయనగా యేసుయొక్క జీవముకూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడునట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. 
12  కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. 
13  కృప యెక్కువమంది ద్వారా ప్రబలించి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి. కాగా 
 14-15. - విశ్వసించితిని గనుక మాటలాడితిని3అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ కలవారమై, ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మునుకూడ లేపి మీతోకూడ తనయెదుట నిలువబెట్టునని యెరిగి, మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. 
16  కావున మేము అధైర్యపడము; మా బాహ్యపురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. 
17  మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక 
18  క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. 
Download Audio File

2 కొరింథీయులకు 5వ అధ్యాయము

1  భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదము. 
2  మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండివచ్చు మన నివాసము దీనిపై ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. 
3-4. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మ్రింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము. 
5  దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు. 
6  వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము. 
7  గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని యెరిగియుండియు, ఎల్లప్పుడును ధైర్యముకలవారమై యున్నాము. 
8  ఇట్లు ధైర్యము కలిగి యీ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. 
9  కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. 
10  ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించినవాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. 
11  కావున మేము ప్రభువు విషయమైన భయమునెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను. 
12  మమ్మును మేమే మీ యెదుట తిరిగి మెప్పించుకొనుటలేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయాస్పదము కలిగించుచున్నాము. 
13  ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. 
14  క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు, 
15  జీవించువారికమీదట తమకొరకు కాక తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. 
16  కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైన ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము. 
17  కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను; 
18  సమస్తమును దేవునివలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధాన విషయమైన పరిచర్యను మాకు అనుగ్రహించెను. 
19  అదేమనగా దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక; క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును (ప్రచురించుట ) మాకు అప్పగించెను. 
20  కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయభారులమై - దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. 
21  ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసరము పాపముగా చేసెను. 
Download Audio File

2 కొరింథీయులకు 6వ అధ్యాయము

1  కాగా మేమాయనతోటిపనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. 
2  -అనుకూల సమయమందు నీ మనవి ఆలకించితిని;రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినిఅని ఆయన చెప్పుచున్నాడు గదా?1ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణదినము. 
3  మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక 
4  శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును 
5  దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై, 
6  పవిత్రతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన, ప్రేమతోను 
7  సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడి యెడమల నీతి ఆయుధములు కలిగి, 
 8-10. ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యున్నామని అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్లమైనట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్నవారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింపబడినవారమైనట్లుండియు చంపబడనివారము; దుఃఖపడినవారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము. 
11  ఓ కొరింథీయులారా అరమర లేకుండ మీతో మాటలాడుచున్నాను;2మా హృదయము విశాలపరచబడియున్నది. 
12  మీయెడల మా అంతఃకరణమే సంకుచితమై యున్నది. 
13  మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను. 
14  మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? 
15  క్రీస్తుకు బెలియాలుతో ఏమి సందర్భము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? 
 16-18. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము;అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు3నేను వారిలో నివసించి సంచరింతును, నేనువారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. - కావున మీరు వారి మధ్యనుండిబయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి;అపవిత్రమైనదాని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు- మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. 
Download Audio File

2 కొరింథీయులకు 7వ అధ్యాయము

1  ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు కలిగియున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి మనలను పవిత్రులనుగా చేసికొందము. 
2  మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి; మేమెవనికిని అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసముచేయలేదు. 
3  మీకు శిక్షావిధికలుగవలెనని నేనీలాగు చెప్పలేదు. చనిపోయిన గాని జీవించినగాని మీరును మేమును కూడ ఉండవలెనని మీరు మా హృదయములలో ఉన్నారని నేను లోగడ చెప్పితిని గదా? 
4  మీయెడల నేను బహుధైర్యముగా మాటలాడుచున్నాను, మిమ్మునుగూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమ యంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. 
5  మేము మకెదొనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. 
6  అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను. 
7  తీతు రాకవలన మాత్రమే కాకుండ, అతడు మా అత్యభిలాషను మీ అంగలార్పును మా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణవలన కూడ మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. 
8  నేను వ్రాసిన పత్రికవలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను; నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టితినని తెలిసికొనియున్నాను. 
9  మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు; మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మావలన మీరు నష్టము పొందకుండుటకై, దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. 
10  దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సు కలుగజేయును; (ఈ మారుమనస్సు ) పశ్చాత్తాపము పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. 
11  మీరు దేవుని చిత్తప్రకారము పొందిన యీ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి (దోష నివారణకైన ) ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమునుగూర్చి సమస్త విషయములలోను మీరు నిర్దోషులై యున్నారని రుజువుపరచుకొంటిరి. 
12  నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు; వానివలన అన్యాయము పొందినవాని నిమిత్తమైనను వ్రాయలేదు; మాయెడల మీకున్న ఆసక్తి దేవునియెదుట మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని. 
13  ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతుయొక్క ఆత్మ మీ అందరివలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి యెక్కువగా మేము సంతోషించితిమి. 
14  ఏలయనగా నేనతని యెదుట మీ విషయమై అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేమేలాగు అన్నిటిని మీతో నిజముగా చెప్పితిమో ఆలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. 
15  మరియు మీరు భయముతోను వణకుతోను తన్ను చేర్చుకొంటిరని అతడు మీయందరి విధేయతను జ్ఞాపకముచేసికొనుచుండగా, అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీయెడల ఉన్నది. 
16  ప్రతి విషయములోను మీవలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను. 
Download Audio File